Allu Arjun: అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించాం: సీపీ

CP CV Anand press meet over Allu Arjun issue

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీ ప్రెస్ మీట్
  • అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ వెళుతున్న వీడియో విడుదల
  • ఇది చూసిన తర్వాతైనా మీకు అర్థం కావడం లేదా అంటూ సీపీ వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తాము తిరస్కరించామని చెప్పారు. అయితే, అనుమతి లేదన్న విషయాన్ని థియేటర్ వాళ్లు అల్లు అర్జున్ కు చెప్పారో, లేదో తెలియదని అన్నారు. ఈ సందర్భంగా... అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ప్రజలకు వాహనం పైనుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వీడియోను కూడా సీపీ విడుదల చేశారు. ఇది చూసిన తర్వాతైనా మీకు అర్థం కావడంలేదా? అని వ్యాఖ్యానించారు.

సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. తొక్కిసలాట వేళ... థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. 

ఆ రోజున విధుల్లో ఉన్న పోలీసు అధికారులతోనూ సీపీ తన ప్రెస్ మీట్లో  మాట్లాడించారు. అక్కడున్న రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నందున అల్లు అర్జున్ ను రావొద్దని చెప్పామని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమో అనుకున్నానని వెల్లడించారు.  

తొక్కిసలాట విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ కు తెలియజేశామని... ఓ మహిళ చనిపోయింది, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పామని వివరించారు. కానీ, అల్లు అర్జున్ వద్దకు మేం వెళ్లేందుకు ఆ మేనజర్ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అక్కడ్నించి వెళ్లిపోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పామని, అయినప్పటికీ వినిపించుకోలేదని, సినిమా మొత్తం చూసి వెళ్లడానికే అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని ఆరోపించారు. దాంతో, డీసీపీ వెళ్లి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News