Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- మారుమూల గిరిజన గ్రామం బాహుజోలలో పర్యటించిన పవన్
- బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
- మీ అంకితభావం ప్రశంసనీయం అంటూ మాజీ జేడీ ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల అనే మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించి, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తెలిసిందే. దీనిపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. గిరిజిన ప్రాంతాల్లో పర్యటించినందుకు మీకు శుభాభినందనలు అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
గిరిపుత్రుల అభివృద్ధి కోసం మీ అంకితభావం నిజంగా ప్రశంసనీయం అని కొనియాడారు. "గిరిజనుల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన 46, 244, 244ఏ, 275(1) అధికరణల్లోని నిబంధనలు వారికి విద్య, భూ హక్కులు, సంక్షేమం కల్పించాలని సూచిస్తున్నాయి.
గిరిజన సంక్షేమం కోసం నిధులకు గిరిజన ఉప ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం, గిరిజన వ్యవహారాల పథకాలు, జిల్లా ఖనిజ లవణాల ఫౌండేషన్ కీలక వనరులుగా ఉన్నాయి. గిరిజనులకు కేటాయించిన నిధులు అట్టడుగుస్థాయి వరకు చేరేలా, గిరిజన పథకాలు సమర్థవంతంగా అమలు చేసేలా మీ నాయకత్వంలో కృషి జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ లక్ష్మీనారాయణ తన ట్వీట్ లో పేర్కొన్నారు.