Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు
- ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ బెంగళూరు నగర పాలక సంస్థ నోటీసులు
- అగ్నిమాపక శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ లేకుండానే రెస్టారెంట్ నిర్వహణ
- వారం రోజుల్లో స్పందించకుంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు నగరంలో ‘వన్8 కమ్యూన్’ అనే పబ్ ఉంది. ఈ పబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ బెంగళూరు బృహత్ మహానగర పాలిక (బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో ఉన్న ఎంజీ రోడ్డులోని రత్నం కాంప్లెక్స్‌లో ఈ పబ్ ఉంది. అగ్నిమాపక శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ తీసుకోకుండానే నిర్వహిస్తున్నారని బీబీఎంపీ పేర్కొంది.
సామాజిక కార్యకర్తలు హెచ్‌ఎం వెంకటేశ్, కుణిగల్ నరసింహమూర్తి అనే వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో బీబీఎంపీ ఈ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 29న నోటీసులు జారీ చేసింది. కానీ, ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశామని, ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే పబ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీకి చెందిన శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
కాగా, జులైలో కూడా ‘వన్8 కమ్యూన్’ పబ్‌పై ఒక కేసు నమోదయింది. అర్ధరాత్రి దాటాక 1 గంట వరకు నడిపించడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు.