Health: ఈ లక్షణాలు కనిపిస్తే... మీరు షుగర్​ అతిగా తీసుకుంటున్నట్టే!

signs youre eating too much sugar

  • ఇటీవలి కాలంలో పెరిగిపోయిన చక్కెర వినియోగం
  • కూల్ డ్రింకుల నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ వరకు చాలా వాటిలో అధిక షుగర్
  • మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తున్నామంటున్న నిపుణులు
  • ఈ లక్షణాలను గుర్తించి జాగ్రత్త పడాలని సూచనలు

ఇటీవలి కాలంలో ఇంటి ఆహారం కంటే బయటి ఫుడ్ తినడం పెరిగిపోయింది. అందులోనూ బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తరచూ తీసుకోవడం ఎక్కువైంది. పైగా కూల్ డ్రింక్స్, పళ్ల రసాలు కూడా. వీటితో మనకు తెలియకుండానే మన శరీరంలోకి చేరే చక్కెర స్థాయులు పెరిగిపోతున్నాయి. తీపిగా అనిపించకపోయినా... చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్ లో అధిక స్థాయిలో చక్కెరలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానికి మనం అలవాటు పడిపోతున్నామని... అలా అధిక చక్కెర శరీరంలోకి వెళుతోందనే దానికి కొన్ని లక్షణాలు సూచికలని చెబుతున్నారు.

ఏదో ఒక తీపి పదార్థం తినాలనిపించడం...
ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింకులు, కొన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్, పళ్ల రసాలు వంటివి ఏదో ఒక తీపి పదార్థాన్ని తరచూ తీసుకోవాలని ఉబలాటంగా ఉండటం... అప్పటికే మన శరీరం అధిక చక్కెరలకు అలవాటు పడిందనే దానికి సూచిక అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెరలకు అలవాటు పడిన శరీరం... తరచూ తీపి పదార్థాలు తినాలనిపించే భావనను పెంచుతుందని సూచిస్తున్నారు.

చర్మంపై కురుపులు, మొటిమలు 
శరీరంలోకి అధికంగా చక్కెర చేరుతూ ఉంటే... రక్తంలో షుగర్ స్థాయిలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్ ఫ్లమేషన్ కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చర్మంపై కురుపులు, మొటిమలు, మచ్చలు వంటివి తరచూ ఏర్పడుతాయని... చర్మం ఇన్ ఫెక్షన్లకు త్వరగా లోనవుతుందని వివరిస్తున్నారు. అంతేకాదు... చర్మం ముడతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఉన్నట్టుండి నీరసం, అలసట రావడం...

చక్కెరలు అధికంగా ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు రక్తంలో షుగర్ స్థాయులు పెరుగుతాయి. కాసేపటికే అంతే వేగంగా పడిపోతూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో సమతుల్యత కొరవడి... ఉన్నట్టుండి నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తరచూ ఇన్ఫెక్షన్లు, జబ్బులు రావడం...
శరీరంలో షుగర్ స్థాయులు వేగంగా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటే... రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనితో తరచూ ఇన్ఫెక్షన్లు, జబ్బులు ఇబ్బందిపెడతాయి. అంతేకాదు... అవి తగ్గడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి.

బరువు పెరిగిపోతుండటం...
చక్కెరలు అధికంగా తీసుకున్నప్పుడు రక్తంలో షుగర్ స్థాయులు వేగంగా పెరుగుతాయి. వాటిని నియంత్రించేందుకు మన శరీరం ఆ షుగర్ ను కొవ్వుగా మార్చి నిల్వ చేసుకుంటూ ఉంటుంది. దీనితో శరీరంలో కొవ్వు పేరుకుపోతూ బరువు పెరిగిపోతుంటారు.

ఈ అంశాలను గుర్తుంచుకోండి
చక్కెర పరిమితికి మించి ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి ప్రమాదమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తేనే చక్కెర అధికంగా వినియోగిస్తున్నట్టు కాదని... ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా శరీరంలో అధిక చక్కెర చేరుతూ ఉండవచ్చని వివరిస్తున్నారు. అంతేగాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతోనూ పైన చెప్పిన లక్షణాలు రావొచ్చని... అందువల్ల తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News