Robin Uthappa: భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. కారణమిదే!
- పీఎఫ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్న మాజీ క్రికెటర్
- తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సుమారు రూ.24 లక్షల పీఎఫ్ బకాయిలు
- బకాయిల చెల్లింపునకు ఈనెల 27 వరకు సమయం
- లేదంటే అరెస్ట్ తప్పదని సమాచారం
- బెంగళూరులో ఉతప్పకు సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ పేరిట దుస్తుల కంపెనీ
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తాను నిర్వహిస్తున్న దుస్తుల కంపెనీలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అతడు ఉద్యోగులకు దాదాపు రూ.24 లక్షల పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించడానికి అతనికి ఈనెల 27 వరకు సమయం ఉంది. లేదంటే అరెస్టును ఎదుర్కోవలసి ఉంటుంది. రాబిన్ ఉతప్ప బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ సుమారు రూ. 23,36,602 పీఎఫ్ నిధులను ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసినప్పటికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు.
మాజీ టీమిండియా ప్లేయర్ ఇలా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో నిధులను జమ చేయకుండా మోసం చేసినట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అతనికి డిసెంబర్ 4న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే, ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా, 39 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ భారత్ తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను మొత్తం 1,183 పరుగులు చేశాడు. ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాప్యులర్ ప్లేయర్‌గా కొనసాగిన విషయం తెలిసిందే.