ded student: పరీక్ష రాసి వచ్చిన కొద్దిసేపటికే హాస్టల్ విద్యార్ధిని ఆకస్మిక మృతి

sudden death of ded student

  • డీఎడ్ పరీక్ష రాసి వచ్చిన గంటల వ్యవధిలోనే విద్యార్ధిని అస్వస్థత
  • ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చి పంపిన వైనం
  • హాస్టల్‌లో కళ్లు తేలేసి మృతి 
  • అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘటన

డీఎడ్ పరీక్ష రాసి వచ్చిన గంటల వ్యవధిలోనే ఓ హాస్టల్ విద్యార్ధిని ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. బెజ్జూరు మండలం అందుగులగూడ గ్రామానికి చెందిన ఆనంద, పోశాలు దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి (19) అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఉంటూ స్రీనిధి కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. 

శుక్రవారం ఉదయం అసిఫాబాద్ లోని ఓ ఉర్దూ మీడియం పాఠశాలలో డీఎడ్ పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఒంటి గంటకు పరీక్ష ముగిసిన తర్వాత నీరసంగా ఉందని సహచర విద్యార్థినులతో చెప్పి సమీపంలోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు తీసుకుని హాస్టల్‌‌కు చేరుకుంది. హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత తలనొప్పి వస్తుందని చెప్పి జండూబామ్ రాసుకుని పడుకుంది. 

అరగంట తర్వాత వెంకటలక్ష్మి కళ్లు తేలేయడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పటికీ శుక్రవారం ఉదయం అందరితో సరదాగా మాట్లాడిన వెంకటలక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందడం అందరినీ విస్మయానికి గురి చేసింది. 

ఈ ఘటనతో సహచర విద్యార్థినులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లిన సమయంలోనే వైద్యులు సరైన చికిత్స చేసి ఉంటే వెంకటలక్ష్మి మృతి చెందేది కాదని కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థినులు అంటున్నారు.  

ded student
sudden death
Telangana
  • Loading...

More Telugu News