KTR: కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... కేసు నమోదు చేసిన ఈడీ

ED files case against KTR

  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
  • కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈసీఐఆర్ నమోదు
  • నిన్న కేసు నమోదు చేసిన ఏసీబీ
  • తాజాగా, మనీలాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు చేయగా, నేడు ఈ అంశంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. 

ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. 

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ నేడు ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా... విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.

కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

KTR
ED
Formula E-Car Racing
BRS
Congress
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News