Chandrababu: ఖర్చు తగ్గించాలి, ఆదాయం పెంచాలి అనేదే మా లక్ష్యం: గంగూరులో సీఎం చంద్రబాబు
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- గంగూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
- ఎప్పుడు ఏ పంట వేస్తే లాభం వస్తుందో రైతులకు వివరిస్తామన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పలువురు మంత్రులతో కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించారు. గంగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల ఖర్చు తగ్గించాలి, ఆదాయం పెంచాలి అనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ సీజన్ లో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో రైతులకు వివరిస్తామని అన్నారు. ముఖ్యంగా, పంట చేతికొచ్చాక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో రైతులకు అవగాహన కలిగిస్తామని చెప్పారు.
ధాన్యానికి సంబంధించి తేమ శాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండడం అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. గోనె సంచుల పంపిణీలో రైస్ మిల్లులు పొరపాట్లు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, 5 కోట్ల గోనె సంచులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
గతంలో మార్కెట్ కమిటీల్లో డ్రైయర్లు ఏర్పాటు చేశామని, తేమ ఎక్కువగా ఉన్న చోట్ల డ్రైయర్లు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. 1,713 రైస్ మిల్లులకు గాను 394 మిల్లుల్లో మాత్రమే డ్రైయర్లు ఉన్నాయని వివరించారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు రైతుకు అవకాశం ఉండాలని భావిస్తున్నామని తెలిపారు.
హార్వెస్టర్ యంత్రాలు వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారని, ఎక్కువ దిగుబడికి కారణాలేంటి అనే అంశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇటీవల డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ ఎక్కువవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంట పొలాల్లో నీరు నిల్వ లేకుండా అధికారులు పర్యవేక్షిస్తుండాలని సూచించారు.
గతేడాది కంటే ఈ ఏడాది, ఈ సమయానికి 40 శాతం ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే 3.20 లక్షల మంది రైతుల నుంచి 21.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 48 గంటల కంటే ముందే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.