Ponguleti Srinivas Reddy: సభ్య సమాజం సిగ్గు పడేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారు: మంత్రి పొంగులేటి
- భూ భారతి బిల్లును ఆమోదించకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్న పొంగులేటి
- ధరణి పోర్టల్ తప్పుల తడక అనే విషయం కేసీఆర్ కు తెలుసని వ్యాఖ్య
- బీఆర్ఎస్ సభ్యుల చిల్లర వేషాలను ప్రజలు హర్షించరన్న మంత్రి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చిస్తుండగా... ఫార్ములా ఈ-రేస్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్నారు. స్పీకర్ పోడియంలోకి కూడా బీఆర్ఎస్ సభ్యులు చొచ్చుకుపోయారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
భూ భారతి బిల్లును ఆమోదించకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని పొంగులేటి మండిపడ్డారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ తప్పులతడక అనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసని చెప్పారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివారని... పుస్తకాలను క్షుణ్ణంగా చదివి ధరణి పోర్టల్ ను రూపొందించి ఉంటారని తాము భావించామని అన్నారు. మూడేళ్లకే ధరణి పోర్టల్ కు వందేళ్లు నిండాయని చెప్పారు.
భూ భారతి బిల్లును సభలో ప్రవేశ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా సూచనలు చేస్తారని భావించామని... కానీ, కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని పొంగులేటి విమర్శించారు. సభలో బీఆర్ఎస్ నేతల చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని చెప్పారు.