West Godavari District: పశ్చిమ గోదావరిలో షాకింగ్ ఘటన .. పార్సిల్‌లో డెడ్ బాడి

dead body found in west godavari district

  • ఉండి మండలంలోని మహిళకు పార్సిల్‌లో గుర్తు తెలియని మృతదేహం
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ 
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళకు పార్సిల్‌లో డెడ్ బాడి (మృతదేహం) రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగంటి గ్రామంలోని ఒక మహిళకు పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. దానిలో ఓ బెదిరింపు లేఖ ఉంది. ఈ ఘటన ఆమెతో పాటు స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. జిల్లా ఎస్పీ నయూం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.    

విషయంలోకి వెళితే.. గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు జగనన్న కాలనీలో స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది.  ఈ క్రమంలో ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించింది. ఆమెకు సదరు సేవా సమితి మొదటి విడతలో టైల్స్ పంపించింది. మరోసారి ఆర్ధిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా, పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి వస్తుందని భావించింది. 

అయితే, తాజాగా వచ్చిన పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రికి బదులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చింది. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొని ఉంది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

West Godavari District
dead body
Andhra Pradesh
Crime News
  • Loading...

More Telugu News