Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ-2025.. ఐసీసీ కీలక ప్రకటన
- హైబ్రిడ్ మోడల్‌లోనే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025
- పాకిస్థాన్, తటస్థ వేదికగా టోర్నీ జరుగుతుందని ఐసీసీ ప్రకటన
- 2027 వరకు ఐసీసీ ఈవెంట్లలోని ఇరు దేశాల మ్యాచులన్నీ తటస్థ వేదికలలోనే
- 2028లో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025 విషయంలో ఇన్నాళ్లు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ విషయంలో ఐసీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు గురువారం వెల్లడించింది.
ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ తో పాటు, తటస్థ వేదికగా కూడా జరుగుతుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక నాకౌట్ గేమ్‌లతో పాటు (ఒకవేళ అర్హత సాధిస్తే) భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే రెండు దేశాలు నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోని ఇరు దేశాల మ్యాచులన్నీ 2027 వరకు తటస్థ వేదికలలోనే జరుగుతాయని జైషా నేతృత్వంలోని ఐసీసీ ప్రకటించింది.
ఈ నిర్ణయం రాబోయే ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది)తో పాటు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 (భారత్ ఆతిథ్యంలో), 2026లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం)కు వర్తిస్తుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
2028లో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం
2028లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పీసీబీకి అందించినట్లు కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి కూడా తటస్థ వేదిక నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2029 నుంచి 2031 మధ్యకాలంలో ఐసీసీ మహిళల ఈవెంట్‌లలో ఒకదానికి ఆతిథ్యం ఇవ్వనుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ త్వరలో రానుంది. చివరిసారి 2017లో జరిగిన ఈ ట్రోఫీలో పాక్ విజేతగా నిలిచింది. దాంతో ఆ టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో పాకిస్థాన్ ఉంది. కాగా, ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పోటీ పడనున్నాయి.