Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపులు.. రుణ సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణ‌యం

Male Dwakra in Andhra Pradesh

  • పేద‌లకు సాయం చేయ‌డానికి ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం
  • డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు 
  • వారితో పొదుపు క‌ట్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా స‌ర్కార్ చ‌ర్య‌లు
  • తొలివిడ‌త‌గా అన‌కాప‌ల్లిలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాల‌నేది ల‌క్ష్యం
  • ఇప్ప‌టికే 20 గ్రూపుల ఏర్పాటు

బ్యాంకుల నుంచి రుణాలు పొంద‌లేక ఇబ్బందులు ప‌డుతున్న పేద‌లకు సాయం చేయ‌డానికి ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. డ్వాక్రా సంఘాల మాదిరిగానే పురుషుల గ్రూపులను ఏర్పాటు చేయిస్తోంది. త‌ద్వారా వారితో పొదుపు క‌ట్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇక తొలివిడ‌త‌గా అన‌కాప‌ల్లిలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాల‌నేది టార్గెట్ కాగా ఇప్ప‌టికే 20 గ్రూపులు ఏర్పాటు అయిన‌ట్లు తెలుస్తోంది. 

డ్వాక్రా సంఘాల మాదిరిగా  కామ‌న్ ఇంట్ర‌స్ట్ గ్రూపులు (సీఐజీ)
టీడీపీ హ‌యాంలో ప‌ది మంది మ‌హిళా స‌భ్యుల‌తో ఒక్కో డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసి, వారితో పొదుపు చేయించారు. దీని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని స‌క్ర‌మంగా చెల్లించిన వారికి రుణం పెంచుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఐదుగురు స‌భ్యుల‌తో కామ‌న్ ఇంట్ర‌స్ట్ గ్రూపు (సీఐజీ) ఏర్పాటు చేస్తున్నారు. 

వాచ్‌మెన్లు, ప్రైవేట్‌గా ప‌నిచేస్తున్నవారు, రిక్షాకార్మికులు, జొమాటో, స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్‌, భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇలా ఎవ‌రైనా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పురుషులు సీఐజీలో చేరొచ్చు. అన‌కాప‌ల్లి జీవీఎంసీ జోన‌ల్ ఆఫీస్‌లోని యూసీడీ కార్యాల‌యంలో ఆధార్, తెల్ల రేష‌న్ కార్డులు జతచేసిన ద‌రఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు. సీఐజీ గ్రూపుల‌కు తొలివిడ‌త‌లో రూ. 75వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కు రుణం అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

20 సీఐజీ గ్రూపుల ఏర్పాటు
ఇప్ప‌టికే అన‌కాప‌ల్లిలో 20 సీఐజీ గ్రూపులు ఏర్పాటు అయిన‌ట్లు యూసీడీ పీడీ వై. సంతోష్ కుమార్‌ తెలిపారు. ఐదుగురు స‌భ్యులు వ‌స్తే ఎన్ని గ్రూపులైనా పెట్ట‌డానికి రెడీగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. గ్రూపులుగా ఏర్ప‌డితే త‌క్కువ వ‌డ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. వాటిని స‌క్ర‌మంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే బ్యాంకులు రుణ ప‌రిమితిని పెంచుతాయ‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News