openai: ఇకపై వాట్సాప్ లో చాట్ జీపీటీ... వివరాలు ఇవిగో!
- చాట్‌జీపీటీకి విస్తృత ప్రజాదరణ
- యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే వాట్సాప్ ద్వారా చాట్‌జీపీటీ సేవలు
- రోజువారీ వాడుకపై పరిమితి
ఇటీవల కాలంలో చాట్ జీపీటీ విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ మరింత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ దీనిని వినియోగించుకోవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా చాట్ జీపీటీ సేవలను వినియోగించుకోవచ్చు.
ఈ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +18002428478 నంబర్‌తో వాట్సాప్‌లో చాట్ చేయొచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. భారత్‌లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇదే నంబర్‌కు కాల్ చేసి కూడా చాట్‌జీపీటీ సేవలు పొందవచ్చు. అయితే, ప్రస్తుతానికి కాల్ సదుపాయం కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితం.
ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలు పొందాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సప్‌లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. అయితే రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. పరిమితి దగ్గర పడిన తర్వాత నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది.
భవిష్యత్తులో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బెస్ట్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సదుపాయాలు కూడా రానున్నాయి. ఇప్పటికే మెటా .. వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా ఓపెన్ ఏఐ అనౌన్స్‌మెంట్‌లో భాగంగా గురువారం చాట్‌జీపీటీ వాట్సాప్ వినియోగాన్ని ప్రకటించింది.