Roja: మేం జగనన్న సైనికులం.. ఎవరికీ భయపడం: రోజా
- భయమనేది జగన్ బ్లడ్ లోనే లేదన్న మాజీ మంత్రి
- ఈవీఎంలను మానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపణ
- ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శించారు. ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరు నెలల కాలంలో వైసీపీ నేతల ఇళ్ల ముందు గుమ్మాలు కొట్టడం, పొలాలకు అడ్డంగా గోడలు కట్టడం తప్ప వారు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇతర హామీల అమలుపై కనీసం ఆలోచన కూడా చేయడంలేదన్నారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో ప్రజలకు అర్థమైందని అన్నారు.
తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, తప్పుడు కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే, భయమనేది తమ నాయకుడు జగన్ బ్లడ్ లోనే లేదని, ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికీ భయపడబోమని పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకు భయపడి ప్రశ్నించడం మానుకోబోమని స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి కోసం ఎవరితోనైనా ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని చెప్పారు.
మేం జగనన్న సైనికులం.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎవరమూ ఎలాంటి తప్పుచేయలేదని రోజా చెప్పారు. గతంలో పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. మోసాలకు పాల్పడి, ఈవీఎంలను టాంపరింగ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని రోజా ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయందని, ఇకపై ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నీతిమాలిన రాజకీయాలను వైసీపీ నేతలు అందరమూ కలిసి ఎదుర్కొంటామని చెప్పారు. టీడీపీ నాయకుల ఒత్తిడికో, తప్పుడు ఆదేశాలకో లోబడి చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులపై హెరాస్ మెంట్ కేసులు వేసి కోర్టులో నిలబెడతామని రోజా హెచ్చరించారు.