Actor Vijay: అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ ట్వీట్!
- ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం
- అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందన్న అమిత్ షా
- ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ టీవీకే అధ్యక్షుడు విజయ్ ట్వీట్
ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే అలెర్జీ అని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే గిట్టదు అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో విజయ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేశారు.
అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి అని విజయ్ కొనియాడారు. అంబేద్కర్ వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అని, సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక అని విజయ్ పేర్కొన్నారు.
ఆయన పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని నొక్కి చెబుతూ, నిరంతరం అంబేద్కర్ నామాన్ని జపిస్తానని ఈ సందర్భంగా విజయ్ అన్నారు. "అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. మన హృదయాలలో, మన పెదవులపై ఆనందంతో ఆయన నామాన్ని జపించుదాం" అని టీవీకే అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
ఇక ఉత్తర తమిళనాడులోని విక్రవాండిలో తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా టీవీకే సైద్ధాంతిక గురువులలో అంబేద్కర్‌ను విజయ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం గణనీయమైన దళిత జనాభాను కలిగి ఉంది. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ థోల్ కంచు కోటగా పరిగణించబడుతుంది. తిరుమావళవన్ స్థాపించిన వీసీకేని గతంలో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.
కాగా, డిసెంబర్ 17న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా విపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని, ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు జపిస్తే స్వర్గానికి చేరుకునేవారని ఆయన అన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.