Cholesterol: రాత్రి నిద్రకు ముందు ఈ లక్షణాలుంటే... అధిక కొలెస్ట్రాల్ కావొచ్చు!
- అధిక కొలెస్ట్రాల్ వల్ల సూక్ష్మ రక్తనాళాల్లో రక్త సరఫరాకు అడ్డంకులు
- ముఖ్యంగా రాత్రిపూట నిద్రకు ముందు కనిపించే కొన్ని లక్షణాలు
- వీటిని గుర్తిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న ఆరోగ్య నిపుణులు
మారిన ఆహార అలవాట్లు, అధిక కొవ్వులు ఉండే ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ తింటుండటంతో చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తుతోంది. ఇది ఊబకాయానికి, గుండె జబ్బులకు దారి తీస్తోంది. అయితే చాలా మంది తమలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించలేరు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తి, పరిస్థితి ఇబ్బందికరంగా మారిన తర్వాత గుర్తించడంతో ఫలితం లేకుండా పోతోంది. అయితే రాత్రి 10 గంటల తర్వాత కనిపించే కొన్ని లక్షణాల ద్వారా కొలెస్ట్రాల్ సమస్యను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఛాతీలో నొప్పి...
రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రాత్రి పడుకున్నాక ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వల్ల రక్త సరఫరా తగ్గిపోయి ఇబ్బంది ఏర్పడుతుందని వివరిస్తున్నారు. ఛాతీలో పట్టేసినట్టు ఉండటం, నొప్పిగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్టుగా ఉండటం దీని లక్షణాలు అని చెబుతున్నారు. ఒక్కోసారి ఇది గుండెపోటుకు దారితీయవచ్చని... అందువల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం...
గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డంకుల వల్ల గుండె శరీరానికి రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోతుంది. దీనివల్ల శరీర కణాలకు సరిగా ఆక్సిజన్ అందదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా పడుకుని ఉన్నప్పుడు తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, లేచి కూర్చుని శ్వాస పీల్చుకోవడం వంటివి జరుగుతుంటే... వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట అలసట, తీవ్ర నీరసం...
ఇది కూడా ‘కొలెస్ట్రాల్’అడ్డంకులతో గుండె రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువ పనిచేయాల్సి రావడం వల్ల వచ్చే సమస్య. శరీర కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందక... శరీరం నీరసించిపోతుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయిన సమయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజంతా పెద్దగా కష్టపడకపోయినా కూడా రాత్రి నీరసంగా ఉంటుంటే... కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తల తిప్పుతున్నట్టుగా, నొప్పిగా ఉండటం...
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ నాళికలలో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వల్ల ఈ సమస్య వస్తుంది. మెదడుకు రక్తం సరిగా సరఫరా కాకపోవడంతో.. తలతిప్పుతున్నట్టుగా, నొప్పిగా ఉంటుంది. ఒకవేళ దీనితోపాటు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటే... వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపులు...
శరీరంలో రక్త సరఫరా సరిగా లేనప్పుడు... కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపులు వంటి ఇబ్బందులు తలెత్తుతాయని... రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డంకులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట తరచూ ఈ సమస్య కనిపిస్తుంటే... కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ విషయం గుర్తుంచుకోండి
పైన చెప్పిన లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యలతోనూ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తగిన వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. ఏదేమైనా రోజూ తగినంత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిళ్లను నియంత్రణలో ఉంచుకోవడం వల్ల... ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని స్పష్టం చేస్తున్నారు.