KTR: 'సీఎం పర్యటనలో ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000'పై స్పందించిన కేటీఆర్
- ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరగబెట్టిందేమీ లేదన్న కేటీఆర్
- లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బు ఏమైందని నిలదీత
- రూ.32 వేల ప్లేట్ భోజనం అరగాలి కదా అంటూ చురక
వేములవాడ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల భోజనాల ఖర్చు నిమిత్తం ఒక్కో ప్లేటుకు రూ.32 వేలు ఖర్చు చేసినట్టు వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక్కో ప్లేటుకు రూ.32 వేల చొప్పున మొత్తం 100 మందికి రూ.32 లక్షల బిల్లు అయినట్లు వార్త వచ్చింది. ఈ అంశంపై కేటీఆర్ మండిపడ్డారు.
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కానీ లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని, ఆ డబ్బు ఎక్కడకు వెళ్లిందని నిలదీశారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా సీఎం, మంత్రుల భోజనాల ఖర్చు నిమిత్తం ఒక్కో ప్లేటుకు రూ.32 వేలు ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తా కథనాన్ని తన ట్వీట్‌లో జత చేస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వ అడ్డగోలు అప్పులు, ఖర్చులను చేస్తోందని ధ్వజమెత్తారు.
ఒక్క ఇటుకను పెట్టలేదు, గుప్పెడు మన్ను కూడా తీయలేదని.. కానీ లక్ష ఇరవై మూడు వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అప్పు సరే కానీ భోజనాలు బాగా అయ్యాయా? అని వేములవాడ పర్యటన సందర్భంగా రేవంత్ సర్కార్ చేసిన ఖర్చును ప్రస్తావించారు. అందరూ కడుపునిండా తిన్నారా..? తిన్నాక పాన్ వేసుకున్నారా..? రూ.32,000 ప్లేట్ భోజనం అంటే అరగాలి కదా? అని ఎద్దేవా చేశారు.