Kantha Rao: మా నాన్నపై మాకు కోపం లేదు: కాంతారావు తనయుడు రాజా!
- కాంతారావు మోసపోయారన్న తనయుడు
- మంచితనం వలన నష్టపోయారని వ్యాఖ్య
- తమకి ఏ లోటూ రాకుండా పెంచారని ఉద్వేగం
- ఏమీ మిగల్చలేదనే బాధ లేదని వెల్లడి
తెలంగాణ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి హీరో కాంతారావు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత కాంతారావు పేరు వినిపిస్తుంది. జానపద కథానాయకుడిగా ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అలాంటి కాంతారావును గురించి ఆయన తనయుడు రాజా, ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. "మా చిన్నప్పుడు మేము చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాము. ఖరీదైన బంగ్లాలలో ఉన్నాము .. కార్లలో తిరిగాము" అని అన్నారు.
" అప్పట్లో చెన్నైలో మాకు ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేది. మా నాన్నగారు ఎలాంటి లోటు లేకుండా మమ్మల్ని పెంచారు. ఆయన నిర్మించిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వలన నష్టపోవడం జరిగింది. తక్కువ పారితోషికం ఇవ్వడం .. కొంత పారితోషికం ఎగ్గొట్టడం .. సినిమాలు నష్టాలు తీసుకురావడం .. నమ్మినవారే మోసం చేయడం వలన .. అన్నివైపుల నుంచి మా నాన్నగారు నష్టపోయారు. ఆయన జీవితమంతా ఎదురీతనే సరిపోయింది" అని చెప్పారు.
" జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా .. ఎంత కోల్పోయినా నాన్నగారు భయపడేవారు కాదు. అయితే చివరి రోజులలో ఒక సొంత ఇల్లు అయినా ఏర్పాటు చేయాలని తాపత్రయ పడ్డారు .. కానీ కుదరలేదు. ఆయనకి కేన్సర్ వచ్చింది .. మేము ఆయనకి చాలా రోజులు ఆ విషయం చెప్పలేదు. తన కీర్తి మాకు అన్నం పెడుతుందని ఆయన అంటూ ఉండేవారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మా నాన్న మాకు ఏమీ మిగల్చకుండా పోయారనే బాధ .. ఆయన పట్ల కోపం ఎప్పుడూ లేదు. మా నాన్న అంటే మాకు ఎప్పుడూ ప్రాణమే" అని అన్నారు.