Panjala Neeraj Goud: వేగం తీసిన ప్రాణం.. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి
- సోమవారం తెల్లవారుజామున కనెక్టికట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రమాద సమయంలో మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న విద్యార్థి
- గ్యాస్ స్టేషన్లోకి దూసుకెళ్లి పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కారు
- తీవ్రంగా గాయపడిన పోలీసు అధికారి
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగం అతడి శ్వాసను ఆపేసింది. కనెక్టికట్‌లో ఉంటూ చదువుకుంటున్న పంజాల నీరజ్ గౌడ్ (23) సోమవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడు ప్రయాణిస్తున్న హ్యుందయ్ ఎలంట్రా కారు అదుపు తప్పి సిట్కో గ్యాస్ స్టేషన్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఫలితంగా అందులో ఉన్న పోలీసు అధికారి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన నీరజ్‌తోపాటు పోలీసు అధికారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నీరజ్ చికిత్స పొందుతూ మృతి చెందగా, పోలీసు అధికారికి చికిత్స కొనసాగుతోంది. ఆయనకు అయిన గాయాలను బట్టి ఇప్పుడప్పుడే ఆయన విధుల్లో చేరే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అదే కారణమని నిర్ధారించారు. ప్రమాద విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశామని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపిస్తామని తెలిపారు. కాగా, నీరజ్ గౌడ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.