RS Praveen Kumar: ఆంధ్రా అభ్యర్థులకు లాభం కలిగేలా గ్రూప్-2 పేపర్ తయారు చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- టీడీపీ, కాంగ్రెస్, తెలంగాణ ద్రోహుల మీదనే ప్రశ్నలు ఉన్నాయన్న ఆర్ఎస్పీ
- కేసీఆర్, టీఆర్ఎస్ మీద ప్రశ్నలు లేకుండా జాగ్రత్త పడ్డారని ఆగ్రహం
- గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్‌లో పూతరేకులు తింటూ తయారు చేశారని ఎద్దేవా
నాన్ లోకల్ కోటాలో కేవలం ఆంధ్రా అభ్యర్థులకు మాత్రమే లాభం జరగాలనే ఉద్దేశంతో గ్రూప్-2 పేపర్ తయారు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పేపర్‌లో ప్రశ్నలు అన్నీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తదితర తెలంగాణ ద్రోహుల మీదనే ఉన్నాయన్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన కేసీఆర్ మీద కానీ, ఉద్యమాన్ని అగ్రగామి శక్తిగా నడిపి తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) మీద కానీ ప్రశ్నలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రచించిన కేసీఆర్ ఆనవాళ్ల నిర్మూలన పథకంలో ఇది మరో అడుగు అని విమర్శించారు.
గ్రూప్ 2 ప్రశ్నపత్రాలను గాంధీ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆత్రేయపురం పూతరేకులు తింటూ తయారు చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని చేసినా తెలంగాణపై కేసీఆర్ సంతకాన్ని చెరిపివేయలేరన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
కొమురం భీం స్ఫూర్తితో లగచర్ల రైతులు పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. లగచర్ల పోరాటానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం కేటీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. యూరప్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేటీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు.