KTR: రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయినంత మాత్రాన అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్
- పేరు మరిచిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా? అని నిలదీత
- అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్
- స్కాములు, ఫార్ములా అవినీతి అంశాలపై కూడా చర్చిద్దామన్న కేటీఆర్
పుష్ప-2 విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోవడమే సినీ నటుడు అల్లు అర్జున్ చేసిన తప్పా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం పేరును మరిచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తొలుత ప్రజాసమస్యలపై చర్చిద్దామని ప్రభుత్వానికి సూచించారు.
స్కాములు, ఫార్ములా (ఈ-కార్ రేసింగ్‌ను ఉద్దేశించి) అంటున్నారని వాటిపై కూడా చర్చిద్దామన్నారు. వీటిని చర్చించాల్సింది కేబినెట్ సమావేశంలో కాదని... అసెంబ్లీలో అన్నారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. ఇందులో భాగంగా అవినీతి ఆరోపణలపై చర్చకు కూడా సిద్ధమే అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజాసమస్యలపై చర్చ పెట్టాలని సవాల్ చేశారు.
లగచర్ల రైతులనే కాదు... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు ఏదైనా ఉపాయం ఉందా? అని ప్రజలు అడుగుతున్నారన్నారు. రోషం ఉన్నవాడైతే ప్రజల తిట్లకు రేవంత్ రెడ్డి ఎప్పుడో చచ్చిపోవాల్సిందన్నారు.