Seethakka: కేటీఆర్, హరీశ్ రావు బేడీలు వేసుకోలేదు... బీఆర్ఎస్‌లో సమానత్వం లేదు: సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Seethakka interesting comments

  • ఎమ్మెల్యేలకు మాత్రమే బేడీలు వేసి దురహంకారం ప్రదర్శించారని ఆగ్రహం
  • బీఆర్ఎస్ హయాంలోనూ రైతులకు బేడీలు వేశారని వ్యాఖ్య
  • లగచర్ల రైతుకు బేడీలు వేయడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్న సీతక్క

కేటీఆర్, హరీశ్ రావు తమ చేతులకు బేడీలు వేసుకోలేదని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం బేడీలు వేశారని, వారి పార్టీలో కనీసం నిరసనలో కూడా సమానత్వం లేకుండా పోయిందని మంత్రి సీతక్క చురక అంటించారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా ఎమ్మెల్యేలు బేడీలు వేసుకొని సభకు వచ్చారు.

ఈ అంశంపై మంత్రి సీతక్క మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలకు బేడీలు వేసి, తాము వేసుకోకుండా కేటీఆర్, హరీశ్ రావులు తమ దురహంకారాన్ని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ఈ ఘటనతో వారి దొరతనం బయటపడిందన్నారు. రైతులకు బేడీలు అంటూ బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారని ఆరోపించారు.

లగచర్ల రైతుకు బేడీలు వేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలను వారే పాటించడం లేదన్నారు. గతంలో వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేసేవారని, ఇప్పుడు ఆ నిబంధనలను వారే కాలరాస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News