Samyuktha Shanmughanathan: 'పుష్ప-2'పై ట్వీట్.. నటి సంయుక్తపై నెటిజన్ల ట్రోలింగ్..!
- 'పుష్ప-2'పై తమిళ నటి సంయుక్త షన్‌ముఘనాథన్ ట్వీట్‌లో చిన్న మిస్టేక్
- సినిమా చూస్తున్న సమయంలో పక్కన కూర్చున్న మహిళ పూనకంతో ఊగిపోయిన వైనం
- దాంతో భయమేసి రూ.10 టికెట్‌లో వెళ్లి కూర్చున్నానన్న సంయుక్త
- ఇప్పుడు ఎక్కడా ఆ ధరకు సినిమా టికెట్ విక్రయించడం లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప-2: ది రూల్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఊచకోత కోస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక మూవీ చూసిన పలువురు ప్రముఖులు సైతం పుష్పను మెచ్చుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంయుక్త షన్‌ముఘనాథన్ పుష్ప-2 సినిమా చూశారు. ఈ సందర్భంగా థియేటర్‌లో ఆమెకు ఎదురైన ఓ ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అయితే, అందులో ఆమె చేసిన చిన్న మిస్టేక్ ట్రోలింగ్‌కు కారణమైంది.
"ఫోనిక్స్ మాల్‌లో 'పుష్ప-2' చూశాను. అయితే, జాతర సీన్‌లో హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడంతో నా పక్కన కూర్చున్న ఓ మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. మహిళను ఆమె భర్త కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా అవ్వడం లేదు. దాంతో భయమేసింది. వెంటనే రూ. 10 టికెట్‌లోకి వెళ్లి కుర్చున్నా" అని సంయుక్త రాసుకొచ్చింది.
ఇప్పుడీ ట్వీట్ వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. రూ. 10 టికెట్ ఎప్పుడో రద్దు అయిందని, నీవు ఏ కాలంలో ఉన్నావని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడా ఆ ధరకు సినిమా టికెట్ విక్రయించడం లేదని ట్రోల్ చేస్తున్నారు.