Mallu Bhatti Vikramarka: మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని.. కేసీఆర్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చేసింది: భట్టి విక్రమార్క
![Deputy CM Mallu Bhatti Vikramarka Sensational Comments on BRS](https://imgd.ap7am.com/thumbnail/cr-20241217tn67611785aaa5c.jpg)
- కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ఈరోజు రాష్ట్ర అప్పులు, రుణ పరిమితిపై మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం
- ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం ధ్వజం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర అప్పులు, రుణ పరిమితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. పైగా చేసిన అప్పులను దాచేసి.. తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. విపక్ష సభ్యులు సభకు, సభాపతికి కనీస గౌరవం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. సభలో ఎవరైనా సరే.. రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని తెలిపారు. గత పదేళ్లలో బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా? అంటూ ఆయన చురకలంటించారు. గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు తాము పాటించాలి కదా అని డిప్యూటీ సీఎం సెటైర్లు వేశారు.