Priyanka Gandhi: ప్రియాంకగాంధీ పాలస్తీనా బ్యాగ్ ధరించడంపై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు
- నెహ్రూ వంటి మహోన్నత వ్యక్తి మనవరాలి నుంచి ఇంతకుమించి ఇంకేమీ ఆశించలేమన్న ఫహ్వాద్
- ప్రియాంక ప్రదర్శించినపాటి ధైర్యాన్ని పాక్ ఎంపీలు ప్రదర్శించలేకపోయారని విమర్శలు
- ‘పిగ్మీ’ల మధ్య ప్రియాంక నిటారుగా నిలబడ్డారని ప్రశంస
‘పాలస్తీన్’ అని రాసివున్న బ్యాగ్‌ను ధరించిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించారు. జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహోన్నతమైన స్వాతంత్ర్య సమరయోధుడి మనవరాలు పిగ్మీల (కురచ మనస్తత్వం) మధ్య నిటారుగా నిలబడ్డారని ఫహ్వాద్ హుస్సేన్ కొనియాడారు. అంతేకాదు, ఈ పాటి ధైర్యాన్ని పాకిస్థాన్ ఎంపీలు ప్రదర్శించలేకపోయారని విమర్శించారు.
జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడి మనవరాలి నుంచి ఇంతకుమించి ఇంకేమి ఆశించగలని ఫహ్వాద్ కొనియాడుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రియాంకగాంధీ నిన్న ‘పాలస్తీన్’ అని రాసివున్న బ్యాగ్‌ను ధరించి పార్లమెంటుకు వచ్చారు. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనా ప్రజలకు ఈ విధంగా ఆమె సంఘీభావం తెలిపారు. ఈ బ్యాగుపై పాలస్తీనా ప్రాంత గుర్తింపును సూచించే పుచ్చకాయ బొమ్మ కూడా ఉంది.
గాజాలో నరమేధం జరుగుతోందంటూ ఈ ఏడాది జూన్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన అనాగరిక చర్యలతో మారణహోమం సృష్టిస్తోందని ఆరోపించారు. గాజాలో భయంకరమైన మారణహోమం ద్వారా రోజురోజుకు పౌరులు, తల్లులు, తండ్రులు, డాక్టర్లు, నర్సులు, సహాయ కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, సీనియర్ సిటిజన్లు తుడిచిపెట్టుకుపోతున్న వేలాదిమంది అమాయక పిల్లల గురించి మాట్లాడితే సరిపోదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మారణహోమాన్ని ప్రతి దేశం ఖండించాలని ప్రియాంక కోరారు.