Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?.. కెప్టెన్ ఎందుకిలా చేశాడు, దీని సంకేతం ఏమిటి?
- గబ్బా టెస్టులోనూ విఫలమైన కెప్టెన్
- గ్లౌవ్స్‌ను డగౌట్ ముందే వదిలి వెళ్లిన హిట్‌మ్యాన్
- ఒక్కసారిగా మొదలైన రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ఊహాగానాలు
- గ్లౌవ్స్ వదిలి వెళ్లడమే సంకేతమంటూ విశ్లేషణలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇదే పునరావృతమైంది. రెండు బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చినట్టు కనిపించినప్పటికీ... హిట్‌మ్యాన్ కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
అయితే, ఔటైన తర్వాత రోహిత్ శర్మ చర్య ఒకటి అతడి రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలకు తావిచ్చింది. కెప్టెన్ తన గ్లౌవ్స్‌ను డగౌట్‌లోకి తీసుకెళ్లలేదు. డగౌట్ ముందే వాటిని వదిలి వెళ్లాడు. దీంతో ఇది రిటైర్‌మెంట్ సంకేతమా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గ్లౌవ్స్‌ను డగౌట్ ముందు వదిలి వెళ్లిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.
మరోవైపు, దారుణంగా విఫలమవుతున్న రోహిత్ శర్మను ఇంకా తుది జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. భారత జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ వరుస వైఫల్యాలే ఇందుకు కారణంగా ఉంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 6.33 సగటుతో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌లలో 15.17 సగటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, టీ20 ప్రపంచ కప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.