Sandhya Theater Stampade Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగుస్తున్న ఉచ్చు.. వెలుగులోకి షాకింగ్ ట్విస్ట్!

Another Twist In Sandhya Theater Stampade Case

  • నటీనటులు వచ్చేందుకు అనుమతి కోరిన సంధ్య థియేటర్ యాజమాన్యం
  • థియేటర్ ఉన్న పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని పోలీసుల రిప్లై
  • నటీనటులు వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమవుతుందన్న పోలీసులు
  • అయినా ఆ విషయం దాచిపెట్టి నటులను రప్పించిన యాజమాన్యం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చారు. 

తాజాగా, ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రీమియర్ షో సందర్భంగా నటీనటులు థియేటర్‌కు వస్తున్న విషయాన్ని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినపతిపత్రం ద్వారా తెలియజేస్తూ అనుమతి కోరింది. అయితే, పోలీసులు ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ థియేటర్ యాజమాన్యానికి పంపిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

   థియేటర్‌కు రెండుపక్కలా రెస్టారెంట్‌లు ఉన్నాయని, నటులు వస్తే భద్రత కల్పించడం ఇబ్బంది అవుతుందని, దీనికి తోడు సంధ్య 70 ఎంఎం, 35 ఎంఎం రెండూ ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని, సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌కు విడిగా ఎంట్రీ, ఎగ్జిట్ లేవని ఆ లేఖలో పోలీసులు పేర్కొన్నారు. సింగిల్ ఎంట్రీ కారణంగా స్పెషల్ షో, న్యూ రిలీజ్ సందర్భంగా ఒకవేళ సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమవుతుందని, కాబట్టి స్పెషల్ షో కోసం హీరోహీరోయిన్లు, ఇతర టీం రావొద్దని చెప్పాల్సిందిగా ఆ లేఖలో పోలీసులు సూచించినట్టుగా ఉంది. చేతి రాతతో ఉన్న ఈ లేఖలో ఇన్‌స్పెక్టర్ స్టాంప్‌తోపాటు అది తమకు ముట్టినట్టుగా సంధ్య థియేటర్ వేసిన స్టాంప్ కూడా ఉంది. 
  ఈ లేఖ కనుక నిజమైనదే అయితే సంధ్య థియేటర్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్టే. తాము వద్దని లేఖ రాసినా యాజమాన్యం నిర్లక్ష్యంగా నటీనటులను ఆహ్వానించడం పెద్ద తప్పే అవుతుందని చెబుతున్నారు. కాగా, కోర్టులో ఇరు పక్షాల వాదనల సందర్భంగా తాము న్యాయమూర్తి ఎదుట నివేదికను ప్రవేశపెట్టినట్టు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు.

  • Loading...

More Telugu News