Prakasam District: అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన అల్లుడు

son in law turns thief and steals from 12 houses in mother in laws village in yerragondapalem mandal prakasam district gurrapusala

  • పనుల కోసం వలస వెళ్లిన గ్రామస్తుల ఇళ్లల్లో చోరీ
  • గుర్రపుశాల గ్రామంలో చోరీలు చేస్తూ హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్న ముండ్ల రామయ్య
  • గ్రామ అల్లుడి నిర్వాకాన్ని పసిగట్టి పట్టుకున్న పోలీసులు

అత్తగారి ఊరిలో ఓ అల్లుడు చేసిన నిర్వాకం గ్రామస్తులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు దృష్టి పెట్టడంతో ఆ ఊరి అల్లుడి నిర్వాకం బయటపడింది. 

వివరాల్లోకి వెళితే.. గుర్రపుశాల గ్రామంలోని ఓ కుటుంబ అల్లుడు ముండ్ల రామయ్య అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. గత నెలలో గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్లారు. అయితే రామయ్య క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్లడం గమనించిన రామయ్య .. ఆ ఇళ్లల్లో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 

రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో రామయ్య దొంగతనం చేశాడు. ఆ ఇళ్లల్లో సుమారు రూ.6 లక్షల 74వేలు చోరీ చేశాడు. ఇదేమీ తనకు తెలియదన్నట్లు రామయ్య ఆ డబ్బుతో హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలోని కొన్ని ఇళ్లకు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనలపై ఎస్ఐ చౌడయ్య గుర్రపుశాల గ్రామానికి చేరుకుని దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ చోరీ కేసులపై పోలీసులు విచారణ జరపగా, గ్రామ అల్లుడే ఈ ఘన కార్యాలు చేశాడని నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేస్తుండగా, పోలీసులు మాటు వేసి అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తమ స్టైల్‌లో విచారణ చేయగా, 12 ఇళ్లల్లో చోరీలు చేసినట్లు రామయ్య అంగీకరించాడు. 

ఆ క్రమంలో యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపర్చి రికవరీ చేసిన నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఊరి అల్లుడి నిర్వాకం బయటపడటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.   

  • Loading...

More Telugu News