assad: రష్యాకు పారిపోయిన తర్వాత తొలిసారిగా స్పందించిన సిరియా మాజీ అధ్యక్షుడు అసద్
- దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదన్న అసద్
- డమాస్కస్‌ను ఆక్రమించుకున్న తిరుగుబాటు దళాలు
- సైనిక స్థావరంపై డ్రోన్ల దాడులు జరగడంతో రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతానికి తరలించిందన్న అసద్
తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను అక్రమించుకున్న నేపథ్యంలో సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రష్యాలో ఆశ్రయిం పొందుతున్నారు. ఈ క్రమంలో, దేశం విడిచి వెళ్లిన తర్వాత అసద్ మొదటిసారి ఎక్స్ వేదికగా స్పందించారు.
డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని అసద్ పేర్కొన్నారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని తెలిపారు. అయితే, ఆ సైనిక స్థావరంపై డ్రోన్ల దాడులు జరగడంతో రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతానికి తరలించిందని పేర్కొన్నారు.
అసద్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. అసద్‌ను అత్యంత సురక్షితంగా తమ దేశానికి తీసుకొచ్చామని రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ సెర్గీ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో రష్యా తన మిత్రులకు అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనమని అన్నారు.