Virat Kohli: కోహ్లీ... కొత్త బంతితో ఆడేది ఇలాగేనా?: పుజారా

Pujara questions Kohli technique against new ball
  • ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా తడబాటు
  • బ్రిస్బేన్ టెస్టులోనూ విఫలమైన కోహ్లీ
  • తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులకే అవుట్
  • కోహ్లీ టెక్నిక్ పై అనుమానాలు వ్యక్తం చేసిన పుజారా
ఆస్ట్రేలియాలోని బౌన్సీ, పేస్ పిచ్ లపై టీమిండియా బ్యాట్స్ మెన్ తడబాటుకు గురవుతుండడం పట్ల మాజీ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా విమర్శనాత్మకంగా స్పందించాడు. ముఖ్యంగా, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరు పట్ల పుజారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

స్వింగ్ అవుతున్న బంతులను ఆడడంలో కోహ్లీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు కోహ్లీ టెక్నిక్ సరిగా లేదని విమర్శించాడు. మూడో టెస్టులో కోహ్లీ బ్యాటింగ్ దారుణంగా ఉందని అన్నాడు. కొత్త బంతిని ఎదుర్కొనే క్రమంలో కోహ్లీ పేలవంగా అవుటవుతున్నాడని పుజారా విశ్లేషించాడు. అదే, పాత బంతిని ఎదుర్కొనే సమయంలో కోహ్లీ మెరుగైన ఆటతీరు కనబర్చాడని, పెర్త్ లో సాధించిన సెంచరీ ఇలా వచ్చిందేనని తెలిపాడు. 

"కోహ్లీ టెక్నిక్ కొత్త బంతిని ఎదుర్కొనేందుకు తగినట్టుగా లేదు. కోహ్లీ బ్యాటింగ్ చేయాల్సి వస్తే 10 ఓవర్ల తర్వాతో, 15 ఓవర్ల తర్వాతో, లేక 20 ఓవర్ల తర్వాతో రావాలేమో. ఫాస్ట్ బౌలర్లు ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎంతో తాజాగా, అలసిపోకుండా ఉంటారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాయంటే, ఆ ప్రభావం టీమ్ మొత్తంపై పడుతుంది. ఆ సమయంలో బ్యాటింగ్ చేయాల్సి రావడం ఏమంత సులభం కాదు. కోహ్లీకి అదే ప్రతికూలంగా ఉంటోంది. కోహ్లీ నెట్స్ లో ఎంతో శ్రమిస్తుంటాడు... కానీ నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన టెక్నిక్స్ ను మ్యాచ్ కు అన్వయించడంలో విఫలమవుతున్నాడు" అని పుజారా వివరించాడు. 

బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులే చేసి హేజిల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు, రెండో టెస్టులోనూ కోహ్లీ విఫలమయ్యాడు. అడిలైడ్ లో జరిగిన ఆ పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 7, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేశాడు.
Virat Kohli
Cheteshwar Pujara
New Ball
Team India
Australia

More Telugu News