Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు... స్పందించిన ప్రియాంక గాంధీ
- హిందువులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన
- పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడాలన్న ప్రియాంక గాంధీ
- అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జైశంకర్ ఆశాభావం
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడుల పట్ల భారత్ గళం విప్పాలని వయనాడ్ ఎంపీ, ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆమె మాట్లాడుతూ... బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. 1971లో నాటి తూర్పు పాకిస్థాన్ పరిస్థితిని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారన్నారు. విజయ్ దివస్ సందర్భంగా... 1971లో అమరులైన వారికి లోక్ సభ వేదికగా ప్రియాంక సెల్యూట్ చేశారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ... దాడులను నిలువరించడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులను అక్కడి ప్రభుత్వం నిలువరించాలన్నారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి వారితో చర్చలు జరిపినట్లు చెప్పారు.