Shakib Al Hasan: ఎక్కడా బౌలింగ్ చేయొద్దు... బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ పై ఐసీసీ నిషేధం

ICC bans Bangladesh star cricketer Shakib Al Hasan

  • షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధం
  • షకీబ్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తింపు
  • అంతర్జాతీయ క్రికెట్, విదేశీ లీగ్ ల్లో ఎక్కడా బౌలింగ్ చేయరాదని స్పష్టీకరణ

అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా, విదేశాల్లోని ఏ లీగ్ లోనూ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసీసీ నిషేధం విధించింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు ఐసీసీ గుర్తించింది. నిబంధనల ప్రకారం 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేయి వంగితే, దాన్ని బౌలింగ్ గా పరిగణించరు. 

గత కొంతకాలంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రావడంతో, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతడికి బౌలింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో షకీబ్ మోచేయి నిబంధనలకు విరుద్ధంగా 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నట్టు తేలింది. దాంతో, మొదట అతడిపై ఇంగ్లండ్ బోర్డు నిషేధం విధించింది. అనంతరం ఐసీసీ కూడా అతడిపై వేటు వేసింది. 

ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా నిర్ధారించింది. ఐసీసీ బ్యాన్ నేపథ్యంలో, జాతీయ క్రికెట్ లోనూ అతడు బౌలింగ్ చేయడానికి అనర్హుడు అని బంగ్లాదేశ్ బోర్డు వెల్లడించింది. 

37 ఏళ్ల షకీబ్ అల్ హసన్ ఓ ఆల్ రౌండర్ గా బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు విశిష్ట సేవలు అందించాడు. ఇప్పటిదాకా 71 టెస్టుల్లో 37 సగటుతో 4,609 పరుగులు చేశాడు. టెస్టుల్లో 246 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు చేసి, 317 వికెట్లు తీశాడు. 129 అంతర్జాతీయ టీ20ల్లో 2,551 పరుగులు, 149 వికెట్లు నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News