KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారు: కేటీఆర్
- అసెంబ్లీలో ఎప్పుడూ లేనివిధంగా పరిమితులు విధిస్తున్నారని విమర్శ
- మీడియా పాయింట్ వద్ద తమ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని ఆరోపణ
- రైతు కూలీలకు రూ.12 వేల గురించి తాము ప్రశ్నిస్తేనే ప్రకటన చేశారన్న కేటీఆర్
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా వైఫల్యాలు బయటకు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను శాసనసభ వైపు రాకుండా చేసిన తీరు సరికాదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలోకి ఉరితాళ్లు, ఎండిన పంటలు, నూనె దీపాలు కూడా తీసుకొచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు.
మీడియా పాయింట్ వద్ద కూడా తమ పార్టీ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వెళుతుండగా కాసేపు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్ అయ్యారని, ఈ విషయం గురించి మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
ఎన్నికల సమయంలో రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన రూ.12 వేల గురించి తాము అసెంబ్లీలో ప్రశ్నించామని, దీంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బయటకు వచ్చి ప్రకటన చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలని, కానీ భట్టి విక్రమార్క బయట ప్రకటన చేయడం అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధమన్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన అనుభవం ఉన్న భట్టి విక్రమార్క బయట ప్రకటన చేయడం సరికాదన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ దేవుళ్లపై ఒట్లు వేసిన విషయానికే దిక్కులేదని, ఇక ఈ మాటలు ఎవరు నమ్ముతారని విమర్శించారు.