deputy cm pawan: ఏపీలో సాహితీ పర్యాటకం కూడా రావాలి: పవన్ కల్యాణ్

representatives of vijayawada book fair met deputy cm pawan

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కలిసిన విజయవాడ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు
  • పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్న కమిటీ ప్రతినిధులు
  • సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్

ఆధ్యాత్మిక పర్యాటకం, సాహస క్రీడలతో కూడిన పర్యాటకం, చారిత్రక పర్యాటకం ఉన్న విధంగానే సాహితీ పర్యాటకం కూడా రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను ఆదివారం విజయవాడ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు కలిసి పలు సమస్యలను వివరించారు. 

35 ఏళ్లుగా విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అయితే పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో సమస్య పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. మన కవులు, రచయితల గొప్పతనాన్ని తెలియజేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. 

శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి గొప్ప కవులు, రచయితల స్వస్థలాలు, వారి జ్ఞాపకాలను కాపాడటం ద్వారా వారి సాహిత్య సేవలు తెలిపేలా స్మారక కేంద్రాల ఏర్పాటుతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు.  
 
వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం, కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయం లాంటి ప్రముఖమైనవి రాష్ట్రంలో ఉన్నాయని, వీటిని కవులు, రచయితల నివాసాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇది తెలుగు భాష అభివృద్ధితో పాటు పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతుందని పవన్ పేర్కొన్నారు. 
 
పవన్‌ను కలిసిన వారిలో విజయవాడ బుక్ ఫెయిర్‌ ప్రతినిధులు టి. మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య, గొల్ల నారాయణరావు, సందీపని ఉన్నారు. 

  • Loading...

More Telugu News