SMAT Final 2024: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబయి.. టోర్నీలో రప్ఫాండించిన ముగ్గురు ఐపీఎల్ ప్లేయర్లు!
- బెంగళూరు వేదికగా ముంబయి, మధ్యప్రదేశ్ ఫైనల్ మ్యాచ్
- ఎంపీని 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలిచిన ముంబయి
- టోర్నీలో మెరిసిన ముగ్గురు ఐపీఎల్ ప్లేయర్లు రహానే, పాటిదార్, సూర్యాంశ్ షెడ్గే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా ముంబయి నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైన్‌ల్‌లో ముంబయి 5 వికెట్ల తేడాతో విజయ సాధించింది. ఎంపీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 5 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 81 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 81 రన్స్ బాదాడు.
అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే (30 బంతుల్లో 37 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48 పరుగులు), సూర్యాంశ్ షెడ్గే (15 బంతుల్లో 36 పరుగులు) మెరుపులు మెరిపించారు. దీంతో 17.5 ఓవర్లలో ముంబయి లక్ష్యాన్ని అందుకుంది.
టోర్నీలో మెరిసిన ముగ్గురు ఐపీఎల్ ప్లేయర్లు
రజత్ పాటిదార్
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ టోర్నీ ఆసాంతం రాణించాడు. ఎంపీని ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న రజత్ పాటిదార్‌దే కీలక పాత్ర. అలాగే ఫైనల్‌లో కూడా ముంబయి జట్టుపై ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఆర్‌సీబీ స్టార్ 40 బంతుల్లోనే 81 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు, ఎస్ఎంఏటీ టోర్నమెంట్‌లో పలు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలు అందించారు. ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచుల్లో 186.08 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేశాడు.
అజింక్య రహానే
టెస్టు బ్యాటర్‌గా గుర్తింపు పొందిన అజింక్య రహానే దేశవాళీ టీ20ల్లో మాత్రం రెచ్చిపోతున్నాడు. ఈ టోర్నీలో కూడా రహానే కొన్ని ఐకానిక్ నాక్‌లు ఆడాడు. సెమీస్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే యువ ప్లేయర్లను వెనక్కి నెట్టి మరీ టోర్నీలో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. రహానే 9 మ్యాచుల్లో 164.56 స్ట్రైక్ రేట్‌తో 469 పరుగులు చేయడం విశేషం. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో గత సీజన్ వరకు రాజస్థాన్‌కు ఆడిన రహానేను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు అతను కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జట్టు పగ్గాలను సైతం రహానేకే అప్పగించే యోచనలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
సూర్యాంశ్ షెడ్గే
పంజాబ్ కింగ్స్‌లో కొత్తగా రిక్రూట్ అయిన సూర్యాంశ్ షెడ్గే మిడిల్ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్‌లు ఆడగలడు. అలాగే భారీ హిట్టింగ్ కూడా చేయగలడు. ఎస్ఎంఏటీ ఫైనల్స్‌లో 7వ స్థానంలో వచ్చిన సూర్యాంశ్ కేవలం 15 బంతుల్లోనే 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబయికి టైటిల్‌ను అందించడంలో కీరోల్ పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో 251.92 స్ట్రైక్ రేట్‌తో 131 పరుగులు చేశాడు. సో.. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. పంజాబ్‌కు కీలక ఆటగాడిగా మారే ఛాన్స్ ఉంది.