KTR: పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకు దిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి: కేటీఆర్

KTR take a dig at CM Revanth Reddy ruling
  • రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
  • తెలంగాణ తిరోగమనంలో వెళుతోందని ఆవేదన
  • వాహన అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు తగ్గాయని వెల్లడి
  • ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ
రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ తిరోగమనం దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలేసి కక్షసాధింపు చర్యలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే ఫలితాలు ఇలా కాక ఇంకెలా ఉంటాయని విమర్శించారు. 

"తెలంగాణ పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించింది. కానీ అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందుతోంది. 

రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి, వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే బైకులు, కార్లు, ఇతర భారీ వాహనాల అమ్మకాలు, వాటి రిజిస్ట్రేషన్లు పెరిగి వృద్ధికి సంకేతాలుగా నిలుస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఆదాయం తిరోమగనంలో ఉంది. 

తెలంగాణ పొరుగునే ఉన్న ఐదు రాష్ట్రాలు 2024లో రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32 శాతం వృద్ధిని నమోదు చేశాయి. తెలంగాణ మాత్రం 2023 కంటే తక్కువ వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం" అని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వాహన అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల గణాంకాల క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.
KTR
Revanth Reddy
BRS
Congress
Telangana

More Telugu News