offbeat: పగలూ, రాత్రి తేడా లేదు.. ఇక్కడ 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు!

 7 places where sun never sets for months

  • భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో నెలల పాటు రాత్రి అనేదే ఉండదు
  • 24 గంటలూ కనిపించే సూర్యుడు
  • భూమి కక్ష్య కాస్త వంగి ఉండటం, సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో జరిగే మార్పులే దీనికి కారణం

రోజులో కొంచెం అటూ ఇటుగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అంటుంటాం. కచ్చితంగా చెప్పాలంటే కాలాన్ని బట్టి గంటా, గంటన్నర అటూ ఇటూ మారుతుంటాయి. ఎండాకాలంలో సూర్యుడు కాస్త ఎక్కువ సేపు ఉంటే, చలికాలంలో కాస్త తక్కువ సమయం ఉంటాడు. కానీ రోజులో సూర్యోదయం, సూర్యాస్తమయం మామూలే. కానీ భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయం అయిందంటే... కొన్ని నెలల వరకు కూడా సూర్యాస్తమయం అన్న మాటే ఉండదు. 24 గంటలూ వెలుతురు ఉండిపోతుంది. అలాంటి ప్రాంతాలేవో తెలుసుకుందాం...

  • నార్వేలోని స్వాల్‌ బార్డ్‌ ప్రాంతం: ఇక్కడ ఏటా ఏప్రిల్‌ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు పగటి సమయమే. సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. అందుకే పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతుంటారు.
  • స్వీడన్‌ లోని అబిస్కో ప్రాంతం: ఇక్కడ మే మొదటి వారం నుంచి జూలై మధ్య వరకు పగటి పూట అన్నట్టే.
  • ఐస్‌ ల్యాండ్‌: ఈ దేశంలోని రేక్జావిక్‌ సహా చాలా ప్రాంతాల్లో మే నెల మధ్య నుంచి జులై మధ్య వరకు సూర్య కిరణాలు 24 గంటలూ ప్రసరిస్తూనే ఉంటాయి.
  • యూఎస్‌ఏలోని అలాస్కా: అమెరికాలోని ఉత్తర ప్రాంతమైన అలాస్కాలో కూడా మే మధ్య నుంచి ఆగస్టు మొదటి వారం వరకు పగటి పూట అన్నట్టే. రాత్రి అనేదే ఉండదు.
  • కెనడాలోని నునావుట్‌, యుకున్‌: ఈ ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్‌ చివరి వారం నుంచి ఆగస్టు మధ్య వరకు కూడా 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు. ఆ తర్వాతే అస్తమిస్తాడు.
  • రష్యాలోని ముర్మానస్క్‌: ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది జనాభా ఉండేది ఈ పట్టణంలోనే. ఇక్కడ మే మధ్య నుంచి జులై మధ్య వరకు సుమారు 62 రోజుల పాటు సూర్యుడు నిరంతరం కనిపిస్తాడు. రాత్రి అనేదే ఉండదు.
  • గ్రీన్‌ ల్యాండ్‌ లోని ఖానాక్‌: ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ ఏప్రిల్‌ చివరి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు ఏకంగా నాలుగు నెలల పాటు నిరంతరం సూర్యుడు కనిపిస్తాడు.

More Telugu News