offbeat: తెలివి ఇన్ని రకాలా..? మన స్థాయిని నిర్ణయించేవి ఏవి?

9 different types of intelligence

  • మనం ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక జ్ఞానమే కారణం
  • ప్రకృతిని ఇష్టపడటం నుంచి బాగా మాట్లాడటం దాకా విభిన్నమైన అంశాలు
  • వాటి స్థాయిని బట్టి మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయంటున్న నిపుణులు

ఎవరైనా ఏదైనా బాగా చెబితే తెలివి ఎక్కువే ఉంది అంటుంటారు. బాగా చదివే పిల్లలనూ తెలివైన వారని పొగుడుతుంటారు. ఎత్తిపొడుపుగా మాట్లాడితే.. తెలివి ఉపయోగిస్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మరి ఇవన్నీ ఒకటేనా? ఏం చేసినా ఒకే తెలివి (జ్ఞానం) కింద జమకట్టేస్తారా? కాదు.. తెలివి తొమ్మిది రకాలు అని నిపుణులు చెబుతున్నారు. వాటి స్థాయిని బట్టి మన తెలివితేటలు  ఆధారపడి ఉంటాయని వివరిస్తున్నారు.

లెక్కలు వేసే తెలివి...
ఎవరైనా కేవలం వేళ్ల మీదో, జస్ట్‌ మనసులోనో ఆలోచించుకుంటూ లెక్కలు వేయగలిగితే దాన్ని లెక్కలు చేయగల జ్ఞానం (మేథమెటికల్‌ ఇంటెలిజెన్స్‌) అంటారు.

భాషాపరమైన తెలివి...
తప్పులు లేకుండా చదవడం, రాయడం... త్వరగా కొత్త భాషను నేర్చుకోగలగడం, వీలైతే కవితలు, కథలు రాయగలగడం వంటి భాషాపరమైన తెలివి (లింగ్విస్టిక్‌ ఇంటెలిజెన్స్‌)గా చెబుతారు.

ఇతరులను అర్థం చేసుకునే జ్ఞానం...
మన చుట్టూ ఉండే వారిని, వారి దృష్టితో చూసి అర్థం చేసుకోగలిగే జ్ఞానం (ఇంటర్‌ పర్సనల్‌) ఇది. ఈ జ్ఞానం మెరుగ్గా ఉన్నవారు ఇతరుల బాధను, సంతోషాన్ని సులువుగా అర్థం చేసుకుని.. తగిన విధంగా స్పందించగలరు.

తమను తాము అర్థం చేసుకోవడం...
చాలా మంది ఇతరులను అర్థం చేసుకున్నంతగా తమను తాము అర్థం చేసుకోలేరు. లోపాలను గుర్తించలేరు. అలా తమను తాము అర్థం చేసుకునే జ్ఞానం.. ఇంట్రా పర్సనల్‌. ఈ సామర్థ్యం ఉన్నవారు... తమను తాము ఉత్సాహపర్చుకుంటూ విజయతీరాలవైపు పయనిస్తారు.

దృశ్య జ్ఞానం... 
కొందరు దేనినైనా చూసినప్పుడు రంగు, ఆకారం నుంచి చిన్న చిన్న అంశాల దాకా వెంటనే గుర్తుపెట్టుకోగలరు. ఏదైనా దూరం నుంచి చూసినా వేగంగా, సులువుగా అంచనా వేసి గుర్తించగలరు. ఇది దృశ్య జ్ఞానం (విజువల్‌ ఇంటెలిజెన్స్‌). 

సంగీత జ్ఞానం...
పెద్దగా శిక్షణ లేకుండానే సంగీతపరమైన సామర్థ్యాన్ని చూపించడం, పాటలు పాడగలగడం వంటివి మ్యూజికల్‌ ఇంటెలిజెన్స్‌ కిందకు వస్తుంది. ఇది ఎక్కువగా ఉన్నవారు డ్యాన్స్‌ కూడా సులువుగా నేర్చుకుని, బాగా చేయగలుగుతారు.

శరీర జ్ఞానం...
ఎప్పుడూ శరీరాన్ని ఫిట్‌ గా ఉంచుకోవడంపై ప్రత్యేకమైన అవగాహన ఉండే జ్ఞానమిది. దీన్ని ‘కిన్‌ ఈస్థటిక్‌ ఇంటెలిజెన్స్‌’గా నిపుణులు చెబుతారు. ఇది ఎక్కువగా ఉన్నవారు... క్రీడల్లో రాణిస్తారు.

పర్యావరణ జ్ఞానం...
మన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ప్రత్యేకమైన అవగాహన, ప్రేమ ఉండే (నేచురలిస్ట్‌) జ్ఞానం ఇది. చెట్లు చేమలు, జంతువులే కాదు... కొండలు, గుట్టలు, అడవులు, నదులు వంటి అన్ని ప్రకృతి అంశాలపై వీరికి విభిన్నమైన అవగాహన ఉంటుంది.

పరమార్థిక జ్ఞానం...
మనం ఏమిటి? మన చుట్టూ ఉన్నదేమిటి? ఈ విశ్వం ఏమిటనే పరమార్థిక అంశాలపై దృష్టిపెట్టే జ్ఞానం ‘ఎగ్జిస్టెన్షియల్‌ ఇంటెలిజెన్స్‌’. ఈ తరహా జ్ఞానం ఉన్నవారు... కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలరని, కొత్త అంశాలను కనిపెట్టగలరని, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News