Manchu Manoj: మీడియాను నేనే లోపలికి తీసుకెళ్లా.. మంచు మనోజ్
- రిపోర్టర్ పై దాడి ఘటనపై వివరణ ఇచ్చిన నటుడు
- మీడియా ప్రతినిధుల తప్పేమీ లేదని వెల్లడి
- లోపలికి వెళ్లాక సడెన్ గా వచ్చి దాడి చేశారన్న మనోజ్
జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఫాంహౌస్ లో ఇటీవల మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నటుడు మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి చేతుల్లో నుంచి మైక్ లాక్కుని దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులదే తప్పని కొంతమంది కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మోహన్ బాబును తప్పుబడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. ఫాంహౌస్ లోపలికి దూసుకు రావడంతో మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ఈ ఇష్యూలో మీడియా ప్రతినిధుల తప్పేమీలేదని, తానే వారిని లోపలికి తీసుకెళ్లానని స్పష్టతనిచ్చారు. తన ఏడు నెలల కూతురును తెచ్చుకోవడానికి ఫాంహౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని చెప్పారు. గేట్లు మూసేసి తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివరించారు. దీంతో తాను గేట్లు పగలకొట్టి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని లోపలికి వెళ్లానని చెప్పారు. ఇంతలో సడెన్ గా తన తండ్రి, ఇతరులు వచ్చి తమపై దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ కు తీవ్ర గాయాలయ్యాయని మనోజ్ వివరించారు.