KTR: విద్యార్థులను మేం ఎవరెస్ట్ ఎక్కించాం.. వాళ్లు ఆసుపత్రి మెట్లు ఎక్కించారు.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్

BRS Leader KTR Setairical Tweet On Congress Govt

  • దొంగలు పడ్డ ఆరు నెలలకు కాంగ్రెస్ పాలకుల స్పందన
  • రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డ మాజీ మంత్రి
  • బీఆర్ఎస్ గురుకుల బాటతో సర్కారులో చలనం వచ్చిందని ట్వీట్

గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం విద్యార్థులను ఆసుపత్రి మెట్లు ఎక్కించిందని కేటీఆర్ ట్విట్టర్ లో మండిపడ్డారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభంగా మార్చేశారని విమర్శించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకుని గురుకులాల బాట పట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ ఏడాది పాలనలో సామాన్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు నింపిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు.. అన్నట్లు పాలకులు ఇప్పుడు గురుకులాలను సందర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. నామమాత్రంగా సందర్శించి, ఫొటోలు దిగి రాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెమెరాల ముందు హడావుడి చేయడంతో సరిపెట్టకుండా గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినాలని, గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News