Raghu Rama Krishna Raju: కస్టడీలో రఘురామకు గాయాలు ఎలా అయ్యాయి?.. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం

CID Former ASP Vijay Paul Questioned In Custodial Torture Case

  • నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్
  • ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్
  • నిన్న ఆరున్నర గంటలపాటు విచారణ
  • 50 ప్రశ్నలు సంధించిన విచారణ అధికారులు

రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను రెండ్రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం రాత్రి ఏడున్నర గంటల వరకు విచారించింది. ఈ సందర్భంగా 50 ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.

అరెస్ట్‌కు, రిమాండ్‌కు మధ్య గాయాలెందుకు?
రఘురామను అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని, రిమాండ్‌కు తరలించే సమయంలో మాత్రం గాయాలతో నడవలేకుండా ఉన్నారని, ఈ మధ్యలో ఏం జరిగిందని విజయ్‌పాల్‌ను అధికారులు ప్రశ్నించారు. ఆయనకు గాయాలు ఎలా అయ్యాయని, సీఐడీ కార్యాలయానికి తరలించినప్పుడు నలుగురు ముసుగు వ్యక్తులు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని, వారెవరని ప్రశ్నించారు. విచారణ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన తనకు తెలియదని, చూడలేదని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

కస్టడీలో రఘురామను కొట్టారా? అని ప్రశ్నిస్తే లేదని చెప్పారని సమాచారం. ముసుగు వ్యక్తుల గురించి తనకు తెలియదని, వారిని తాను చూడలేదని చెప్పారు. సాక్ష్యాలు చూపించి ప్రశ్నించినా తప్పించుకునేలా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే, రఘురామను వేధించాలని ఆదేశించింది ఎవరన్న ప్రశ్నకు కూడా ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని తెలిసింది. కాగా, నిన్న ఆరున్నర గంటలపాటు విజయ్‌పాల్‌ను విచారించిన అధికారులు, నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విచారిస్తారు. అనంతరం గుంటూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచిన తర్వాత తిరిగి జైలుకు తరలిస్తారు.

More Telugu News