Nitin Gadkari: కుల రాజకీయాలపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు
- కులం పేరుతో ఎన్నికల్లో గెలిచిన నాయకులు తమ వర్గానికి ఏమి చేయరని పేర్కొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- చేసిన పనిని చూపించడానికి లేనివారే కులం పేరుతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారన్న మంత్రి
- తమ సామాజిక వర్గం సంక్షేమానికి కృషి చేసినట్లు ఒక్క ఉదాహరణ అయినా చూపుతారా అని ప్రశ్నించిన గడ్కరీ
కుల రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైమ్స్ నెట్ వర్క్ ఇండియా ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో కుల రాజకీయాల అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. కులం పేరుతో ఎన్నికల్లో గెలిచే నాయకులు తమ వర్గానికి ఏమీ చేయరని అన్నారు. అంతే కాకుండా తమ కుటుంబ సభ్యులకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు అడుగుతారని చెప్పారు. వెనుకబాటుతనం రాజకీయ ప్రయోజనంగా మారిందన్నారు. చేసిన పనిని చూపించడానికి లేనివారే కులం పేరుతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఎన్నికల్లో కులం పేరుతో గెలిచిన వారు ఎవరైనా తమ సామాజిక వర్గం సంక్షేమానికి కృషి చేశారా? అలా చేసినట్లు ఒక్క ఉదాహరణ చెప్పండి అని అడిగారు. పేద ప్రజలు, యువత, రైతులు, మహిళల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు కృషి చేయాలని హితవు పలికారు.
ఎన్నికల ప్రచార సమయాల్లో తాను ఎప్పుడూ కులం గురించి ప్రస్తావించలేదని గడ్కరీ స్పష్టం చేశారు. రాజకీయాలు తన వృత్తి కాదని, ఇది సామాజిక ఆర్ధిక సంస్కరణలకు సాధనమని అన్నారు. సామాజిక సేవ బాగా చేయడం చేయడం ద్వారానే ప్రజల మనసులను గెలుచుకోగలమని తన విశ్వాసమని పేర్కొన్నారు.