Nara Lokesh: మౌలిక వసతులు హార్డ్ వేర్ అయితే... ఉపాధ్యాయులు సాఫ్ట్ వేర్: నారా లోకేశ్
- ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశం
- ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు
- గత ప్రభుత్వంలో మాదిరిగా తమ వద్ద పరదాలు ఉండవన్న మంత్రి
ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించామని, ఇప్పుడు అమలుచేయలేకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
జీవో. 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో లోకేశ్ శుక్రవారం నాడు ఉండవల్లి నివాసంలో 4 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు.
"రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక గత ఆరు నెలలుగా లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పాఠశాల విద్య ఉన్నతాధికారులు ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై నిరంతరం చర్చలు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మావద్ద పరదాలు ఉండవు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు.
సంస్కరణల అమలులో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడం. అపార్ ఐడి నమోదు 70 శాతం పూర్తయ్యాక కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. డ్రాపవుట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సంస్కరణలు అమలుచేయడం అనివార్యం. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లతో పోటీపడాలి. ఇందులో భాగంగా ఇటీవల మెగా పీటీఎంను విజయవంతంగా నిర్వహించాం. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నదే మా ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు సూచనలమేరకు బాలల్లో నైతిక విలువలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తాం.
విధినిర్వహణలో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతాం. ఉపాధ్యాయులపై అనవసరమైన యాప్ ల భారం తగ్గించాం. ఇంకా అమలులో ఉన్న నాన్ అకడమికమ్ యాప్ ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తాం. మౌలిక సదుపాయాలు హార్డ్ వేర్ అయితే టీచర్లు సాఫ్ట్ వేర్ లాంటి వారు. రాబోయే అయిదేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ మా లక్ష్యం. ఉపాధ్యాయుల సహకారంతోనే అది సాధ్యం" అని లోకేశ్ వివరించారు.
పదోన్నతులకు అవకాశం కల్పించండి
సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ... 20ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన సెకండరీ టీచర్ కేవలం స్కూల్ అసిస్టెంట్, హెచ్ ఎం పదోన్నతితోనే ఆగిపోతున్నారు, లెక్చరర్లు, డివైఇఓ వంటి ప్రమోషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డివైఈఓ పోస్టుల భర్తీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల తొలి తప్పిదానికే తీవ్రమైన చర్యలు అమలుచేస్తున్నారని, ఈ విషయంలో పట్టువిడుపుతో వ్యవహరించాలని సూచించారు. 100రోజుల ప్రణాళికలో ఆదివారాలను మినహాయించాలని విన్నవించారు.