Allu Arjun: అల్లు అర్జున్ కు నిరాశ.. రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు రిమాండ్
- 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- బన్నీని చంచల్ గూడ్ జైలుకు తరలించనున్న పోలీసులు
అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని... హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని కోర్టును బన్నీ తరపు లాయర్లు కోరారు. వారి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు... బన్నీకి రిమాండ్ విధించింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశాలున్నాయి. అయితే, హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్నందున... హైకోర్టు తీర్పు వచ్చాకే బన్నీ రిమాండ్ పై స్పష్టత రానుంది.
ఒక వేళ హైకోర్టులోనూ చుక్కెదురైతే... కోర్టు మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంచల్ గూడ జైలు వద్ద కూడా పోలీసు బందోబస్తును పెంచినట్టు తెలుస్తోంది.