Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం కొడుకు పోటీ!
- మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపిన హస్తం పార్టీ
- మొత్తం 21 మందితో గురువారం తొలి జాబితా విడుదల
- వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిగిలింది తక్కువ సమయమే కావడంతో పార్టీలన్నీ ముమ్మర కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రత్యేకించి అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ గురువారం 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సందీప్... న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజవర్గంలో కేజ్రీవాల్‌తో తలపడనున్నారు. ఈ స్థానంలో కేజ్రీవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు
ఇక బద్లీ స్థానం నుంచి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, బల్లిమారన్ నుంచి ఢిల్లీ మాజీ మంత్రి హరూన్ యూసుఫ్, పట్‌పర్‌గంజ్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, వజీర్‌పూర్ నుంచి జాతీయ అధికార ప్రతినిధి రాగిణి నాయక్, ద్వారకా సీటు నుంచి ఆదర్శ్ శాస్త్రి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఈ మేరకు 21 మంది అభ్యర్థుల పేర్లకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గురువారం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఈసీ సభ్యులు అంబికా సోనీ, సల్మాన్ ఖుర్షీద్, టీఎస్ సింగ్ డియో, తదితరులు పాల్గొన్నారు. ఆ వెంటనే పార్టీ నాయకత్వం జాబితాను విడుదల చేసింది.