Sharmila: చంద్రబాబు గారి అర్ధ సంవత్సర పాలన పూర్తిగా అర్థరహితం: షర్మిల
- ఏపీలో కూటమి పాలనకు ఆర్నెల్లు పూర్తి
- ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ షర్మిల విమర్శలు
- ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఫైర్
ఏపీలో కూటమి పాలనకు ఆర్నెల్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతృత్వంలోని చంద్రబాబు గారి అర్ధ సంవత్సర పాలన పూర్తిగా అర్థ రహితమని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు ఈ ఆరు నెలల్లో దిక్కులేదు... మేనిఫెస్టోలో పేర్కొన్న 60 హామీలు పత్తా లేవని విమర్శించారు.
"సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారు. 3 వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు... ఇచ్చారా? అని అడుగుతున్నా. చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని పంగనామాలు పెట్టారు. రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖీభవ పథకంలా మార్చేశారు.
ప్రతి మహిళకు రూ.1500 అన్నారు... ఈ ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అన్నారు... ఎప్పట్నించో చెప్పమంటే పండుగలు, పబ్బాలు పేర్లు చెబుతున్నారు. జూన్ 12న తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పై పెట్టారు... ఇప్పటికీ నోటిఫికేషన్ కు దిక్కులేదు. ఉచిత ఇసుక పథకంలో ఉచితం కనిపించడంలేదు.
చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మొదటి ఐదేళ్లు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇప్పుడు మళ్లీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో రూ.17,500 కోట్ల భారాన్ని జనం నెత్తిన వేశారు. నాణ్యమైన మద్యం అంటూ ధరలు పెంచారు.
ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తే... రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని చంద్రబాబు ఇప్పటికీ అదే చెబుతున్నారు. వైసీపీ వాళ్లు ఐదేళ్లు అడవి పందుల్లా మేశారని, అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టాలని అంటున్నారు. నిజమే... వైసీపీ వాళ్లది దోపిడీ పాలన, దొంగల పాలన... అందుకే జనాలు బుద్ధి చెప్పారు. మీరేదో ఉద్ధరిస్తారని కదా ప్రజలు మీకు పట్టం కట్టింది... మరి మీరు చేస్తున్నదేమిటి? ఈ ఐదేళ్లూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే ఉంటారా? ఇచ్చిన హామీల గురించి ఆలోచించరా?
గత సర్కారు తప్పులను ఎత్తిచూపుతూ ఈ ఆర్నెల్లు కాలయాపన చేశారు. మీ 4.0 ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది బాబు గారూ! హామీలను అమలు చేయకుండానే, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసేలా చూడండి" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.