Raja Singh: మోహన్ బాబుకు రాజాసింగ్ కీలక సూచన
- జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన ఘటనపై రాజాసింగ్ స్పందన
- ఇంటి గొడవలు ఇంటికే పరిమితమైతే మంచిదన్న రాజాసింగ్
- గాయపడిన జర్నలిస్టును పరామర్శించాలని సూచన
జల్ పల్లిలోని తన నివాసం వద్ద ఒక జర్నలిస్టుపై సినీనటుడు మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదయింది.
ఈ నేపథ్యంలో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ... మోహన్ బాబుకు కీలక సూచనలు చేశారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని రాజాసింగ్ చెప్పారు. మోహన్ బాబు కుమారుడు ఆహ్వానించడం వల్లే వారి నివాసంలోకి జర్నలిస్టులు ప్రవేశించారని అన్నారు.
మీ కుటుంబ గొడవలు మీ ఇంటి వరకు పరిమితమయితే మంచిదని మోహన్ బాబుకు రాజాసింగ్ సూచించారు. ఇంటి సమస్యలను పబ్లిక్ లో పెట్టడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. జర్నలిస్టుపై దాడి ఘటనను ఇలాగే వదిలేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని అన్నారు. మీ వైపు నుంచి పొరపాటు జరిగిందని గమనించి క్షమాపణలు చెప్పడం మంచిదని హితవు పలికారు. గాయపడిన జర్నలిస్టును పరామర్శించడం కూడా ఉత్తమమని అన్నారు. మీడియా ఒక వ్యక్తిని హీరో చేయగలదని... అదే సమయంలో జీరోగా కూడా చేస్తుందని చెప్పారు.