Atul Subhash: నా కొడుకును చిత్రవధ చేశారు.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ తల్లి
- బెంగళూరులో ఈ నెల 9న ఉరివేసుకున్న టెకీ అతుల్ సుభాష్
- భార్య, ఆమె కుటుంబ సభ్యుల చేతిలో అనుభవించిన టార్చర్‌ను తమకు చెప్పకుండా దాచిపెట్టాడంటూ తల్లి కన్నీటి పర్యంతం
- భార్య పెట్టిన కేసుల కారణంగా కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నదీ రాసుకొచ్చిన టెకీ
- అతుల్ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కింద కేసు
తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేశారని, అతడి ఆత్మహత్యకు అదే కారణమని బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న టెకీ అతుల్ సుభాష్ తల్లి పేర్కొన్నారు. భర్తతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. భార్య, ఆమె కుటుంబ సభ్యుల చేతిలో తన కుమారుడు చిత్రవధ అనుభవించాడని, అయితే, అవేమీ తమకు తెలియకుండా దాచాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల అతుల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఉరివేసుకున్నాడు. అంతకుముందు 1.5 గంటల వీడియో చిత్రీకరించడంతోపాటు, 24 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. అందులో తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎలా వేధిస్తున్నదీ వివరించాడు. భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎలా వేధిస్తున్నదీ అందులో పూసగుచ్చినట్టు రాసుకొచ్చాడు. అదనపు కట్నం, అసహజ శృంగారం, హత్యాయత్నం అంటూ తనపై తప్పుడు కేసులు ఎలా పెట్టిందీ వివరించాడు. ఈ కేసుల కారణంగా ఏడాది కాలంగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ ఫ్యామిలీ కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నదీ చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో అతడి భార్య, ఆమె కుటుంబంపై పోలీసులు బీఎన్ఎస్‌లోని సెక్షన్లు 108, 3(5) కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అయితే, సుభాష్ ఆరోపణలను ఆయన అత్త కొట్టిపడేశారు. అతడు తన ఫ్రస్ట్రేషన్‌ను తమపై చూపించాడని, అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు.