Manchu Family Row: మరోసారి గొడవ చేస్తే తీవ్ర చర్యలు: మంచు సోదరులకు సీపీ హెచ్చరిక
- తారస్థాయికి మంచు కుటుంబం గొడవలు
- ఈ నేపథ్యంలో బుధవారం సీపీ సుధీర్ బాబు ఎదుట విచారణకు మంచు సోదరులు
- కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని సీపీ వార్నింగ్
- శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించిన మనోజ్
ఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సీపీ వారిని విచారించారు. ఈ సందర్భంగా.. కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాదిపాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.