Kerala: 17 ఏళ్ల క్రితం అసభ్యంగా ప్రవర్తించాడని నటి కేసు... విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Anticipatory bail for Balachandra Menon

  • 2007లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాలచంద్ర మీనన్‌పై ఓ నటి ఫిర్యాదు
  • తనపై కేసు నమోదు కావడంతో హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు
  • ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • మహిళలకే కాదు... పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయన్న హైకోర్టు

ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించాడనే అభియోగాలపై నమోదైన కేసులో సీనియర్ నటుడు, దర్శకుడు బాలచంద్ర మీనన్‌కు కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకే కాదు... పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయని వ్యాఖ్యానించింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాక చాలామంది నటీమణులు... తామూ వేధింపులకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బాలచంద్ర మీనన్‌పై కూడా ఓ నటి ఫిర్యాదు చేసింది. 2007లో ఓ సినిమా షూటింగ్‌లో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆ నటి ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదుతో బాలచంద్రన్ మీనన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

తనపై ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేసిందంటూ బాలచంద్ర మీనన్ హైకోర్టును ఆశ్రయించారు. 17 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ కేసు వేశారన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం... ఆయన వాదనలో బలం ఉందని తెలిపింది.

అయితే, 17 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి ఎదుట హాజరు కావాలని బాలచంద్ర మీనన్‌ను ఆదేశించింది. ఈ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గౌరవ మర్యాదలు పురుషులకూ ఉంటాయని, న్యాయప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. కేసు దర్యాఫ్తు తర్వాత అతనిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే రూ.50 వేల బాండు, ఇద్దరి పూచీకత్తుతో అతనిని విడుదల చేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News